పాలకుల దూకుడు చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్తుపై ఏమాత్రం పట్టింపు లేనట్టుంది: విజయశాంతి

  • సెప్టెంబరు 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభం
  • కేసులు తగ్గుతున్నట్టు భావిస్తోన్న సర్కారు
  • విద్యాసంస్థల్లో సౌకర్యాలపై ప్రశ్నించిన విజయశాంతి
  • పాలకులు మొండిగా ముందుకెళ్లరాదని హితవు
సెప్టెంబరు 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సర్కారు విద్యాసంస్థలకు అనుమతి ఇచ్చింది. దీనిపై బీజేపీ మహిళా నేత విజయశాంతి విమర్శనాత్మకంగా స్పందించారు. కొవిడ్ తగ్గిందంటూ పాఠశాలలు తెరిచేందుకు రాష్ట్ర సర్కారు ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తుంటే పాలకులకు విద్యార్థుల భవిష్యత్తుపై ఏమాత్రం పట్టింపు లేదన్న విషయం అర్థమవుతోందని తెలిపారు.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో లాక్ డౌన్లు విధించడంతో అనేక స్కూళ్లలో ఫర్నిచర్ పాడైపోయిందని, వర్షాలకు గోడలు, పైకప్పులు దెబ్బతిని ప్రమాదకరంగా తయారయ్యాయని, పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కూడా కరవైనట్టు ఉస్మానియా వర్సిటీ మాజీ డీన్ వెల్లడించిన వైనం మీడియాలో వచ్చిందని విజయశాంతి వివరించారు. అనేక ప్రాంతాల్లో కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాలలకు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని తెలిపారు.

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం స్కూళ్లు తెరిచేందుకు వారం రోజుల సమయం కూడా లేదని, ప్రాథమిక సౌకర్యాల పరిస్థితులు చక్కదిద్దకుండా పిల్లలను స్కూళ్లకు రప్పిస్తే వారు చదువుకునే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు.

అగ్రరాజ్యం అమెరికాలోనూ బడులు తెరిచిన తర్వాత పిల్లల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే విద్యాసంస్థలు తెరవాలని తల్లిదండ్రులతో సహా అందరూ కోరుకుంటున్నారని వివరించారు. ఇవేమీ పట్టించుకోకుండా తెలంగాణ పాలకులు మొండిగా ముందుకెళితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని విజయశాంతి స్పష్టం చేశారు.


More Telugu News