మొత్తం ఆఫ్ఘనిస్థాన్ కోసం మా పోరాటం: అహ్మద్ మసూద్ ప్రతినిధి

  • తాలిబన్ వ్యతిరేక మిలటరీ బేస్‌గా మారుతున్న పాంజ్ షీర్ 
  • యుద్దమైనా, శాంతైనా దేనికైనా సిద్ధం
  • తాలిబన్లతో కొనసాగుతున్న సంప్రదింపులు
  • ఎటువంటి ఒప్పందం కాలేదన్న అహ్మద్ మసూద్ వర్గం
మెరుపు వేగంతో ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు లొంగని ఏకైక ప్రాంతం పాంజ్ షీర్. ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలెహ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనతోపాటు తాలిబన్ వ్యతిరేక పోరాట యోధుడు అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ క్రమంలో తాలిబన్ వ్యతిరేకులందరూ ఇక్కడకు చేరుకొని పాప్యులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు.

 పాంజ్ షీర్ వ్యాలీకి వెళ్లే మార్గాలన్నీ దేశభక్తులైన టాజిక్ ఫైటర్ల అధీనంలో ఉన్నాయి. వీళ్లందరూ అహ్మద్ షా మసూద్‌ కథలు వింటూ పెరిగారు. 1980ల కాలంలో సోవియట్లకు ఎదురు నిలిచిన అహ్మద్ షా.. ఆ తర్వాత 1996 నుంచి 2001 వరకూ తాలిబన్ల పాలకులను ఎదిరించారు. ఆయన కుమారుడైన అహ్మద్ మసూద్ నాయకత్వంలోనే ఇప్పుడు పాప్యులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏర్పాటవుతోంది. దీనికోసమే తాలిబన్ వ్యతిరేకులంతా ఇప్పుడు పాంజ్ షీర్ చేరుతున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అహ్మద్ మసూద్ ప్రతినిధి ఫాహిమ్ దష్తీ కీలక వ్యాఖ్యలు చేశారు.

  అందరినీ కలుపుకొని పోవాలని తాలిబన్లు అనుకుంటే కనుక కాబూల్ ప్రభుత్వంలో కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫాహిమ్ చెప్పారు. అయితే ఈ విషయంలో తాలిబన్లతో ఎలాంటి ఒప్పందం ఇంకా జరగలేదని, సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

‘‘మేం పాంజ్ షీర్ కోసం పోరాడటం లేదు.. పూర్తి ఆఫ్ఘనిస్థాన్ కోసం యుద్ధం చేస్తున్నాం. ఆఫ్ఘన్లు, మహిళలు, మైనార్టీల హక్కులపై మేం ఆందోళన చెందుతున్నాం. సమానత్వం, హక్కులు ఉంటాయని తాలిబన్లు నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన స్పష్టంచేశారు.

తాలిబన్లతో యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి కావలసిన అన్ని సదుపాయాలూ తమ వద్ద ఉన్నాయని పాప్యులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ దళాల కమాండర్ అమీర్ అక్మల్ చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘మిలటరీ, యుద్ధానికి కావలసిన అన్ని సదుపాయాలూ మాకు ఉన్నాయి. తాలిబన్లు శాంతి కోరుకున్నా లేక తుపాకీ ఎక్కుపెట్టినా.. దేనికైనా మేం రెడీ’’ అని ఆయన పేర్కొన్నారు.


More Telugu News