కార్యకర్తకు మద్దతుగా కర్నూలు జిల్లా ఎస్పీకి నారా లోకేశ్ లేఖ

  • టీడీపీ కార్యకర్తను వేధిస్తున్నారన్న లోకేశ్
  • ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసులు కక్షసాధిస్తున్నారని విమర్శ   
  • అధికార పక్షం కోసం పనిచేస్తున్నారని ఆరోపణ
  • తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి
రామాంజనేయులు అనే టీడీపీ కార్యకర్తకు మద్దతుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రంగంలోకి దిగారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం మార్కాపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే టీడీపీ కార్యర్తను పోలీసులు వేధిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.

ఈ వేధింపుల వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని, ఎమ్మెల్యే ఆదేశాలతోనే రామాంజనేయులుపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్లలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు ఇవాళ చేసిన వ్యాఖ్యలకు ఈ ఘటనే నిదర్శనమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఓ సాధారణ కుటుంబాన్ని పోలీసులు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడడం సరికాదని హితవు పలికారు.

వైసీపీ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు పోలీసులు ప్రవర్తిస్తున్నారని, తమ పోలీసు విధులను కూడా పక్కనబెట్టి అధికార పార్టీ నేతల కోసం పనిచేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీని కోరారు. పోలీసులు బనాయించే తప్పుడు కేసులు ఎదుర్కోవడం సామాన్యులకు శిక్షగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News