కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు... 11 మంది దుర్మరణం

  • ఉగ్రదాడి జరగొచ్చని హెచ్చరించిన అమెరికా
  • అమెరికా హెచ్చరికను సమర్థించిన బ్రిటన్, ఆస్ట్రేలియా
  • హెచ్చరిక నిజమైన వైనం
  • పేలుడుపై బైడెన్ కు సమాచారం అందించిన పెంటగాన్
ఆఫ్ఘనిస్థాన్ లో కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. కాబూల్ విమానాశ్రయం గేటు వద్ద భారీ పేలుడు సంభవించింది. తమ దేశ పౌరులతో పాటు ఆఫ్ఘన్లు కూడా కాబూల్ విమానాశ్రయ పరిసరాలకు రావొద్దని అమెరికా ఈ ఉదయమే హెచ్చరించగా, కొన్ని గంటల్లోనే పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. పేలుడు జరిగిన గేటు వద్ద పెద్ద సంఖ్యలో ఆఫ్ఘన్ పౌరులు ఉన్నారు.

ఇది ఆత్మాహుతి దాడేనని అమెరికా రక్షణశాఖ భావిస్తోంది. ప్రాణనష్టం, తదితర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు రక్షణశాఖ వర్గాలు సమాచారం అందించాయి. కాగా, ఈ ఘటనలో ముగ్గురు అమెరికా సైనికులు, అనేకమంది ఆఫ్ఘన్ పౌరులు గాయపడినట్టు తెలుస్తోంది.


More Telugu News