డ్రగ్స్ కేసులో త్వరగా విచారణ పూర్తి చేస్తే బాగుంటుంది: తమ్మారెడ్డి భరద్వాజ

  • టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం
  • నిన్న పలువురు ప్రముఖులకు ఈడీ నోటీసులు
  • ఈ వ్యవహారంలో స్పందించిన తమ్మారెడ్డి
  • డ్రగ్స్ వాడకం తప్పు అని వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిన్న నోటీసులు జారీ చేసింది. దీనిపై టాలీవుడ్ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఈ కేసులో సాధ్యమైనంత వేగంగా విచారణ ముగిస్తే బాగుంటుందని అన్నారు. విచారణ కొనసాగినంత కాలం ఈ కేసులో ఉన్న ప్రముఖుల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుంటారని వెల్లడించారు.

తనకు తెలిసినంత వరకు సినీ పరిశ్రమలో మాదకద్రవ్యాల విక్రేతలు ఎవరూ ఉండకపోవచ్చని, డ్రగ్స్ వాడేవాళ్లు ఎవరైనా ఉంటే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.  ఏదేమైనా మాదకద్రవ్యాల వాడకం అనేది తప్పు అని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా విచారణ జరుగుతోందని, ఇదొక కామెడీ తంతులా మారిందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

"వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలి. విచారణ జరిగినన్ని రోజులు ఈ కేసులో ఉన్న ఓ పది మంది, వాళ్ల కుటుంబసభ్యులు ఇబ్బంది పడతారు... ఆ తర్వాత మామూలే. అందుకే విచారణ వేగంగా జరిపి దోషులుంటే శిక్షలు వేయడమో, లేకపోతే వదిలేయడమో చేయాలి. లేకపోతే, విచారణ జరిగినప్పుడలా ఈ కేసులో ఉన్నవారి కుటుంబాలు ఇబ్బంది పడుతుంటాయి" అని వివరించారు.

ఈ కేసులో నిన్న ఈడీ రకుల్ ప్రీత్ సింగ్, రానా, తరుణ్, నందు, పూరీ జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, నవదీప్, రవితేజలకు నోటీసులు పంపింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు జరిగే విచారణకు హాజరు కావాలంటూ సదరు ప్రముఖులను ఆదేశించింది.


More Telugu News