కడప జిల్లాలో సెంచరీ ప్లైబోర్డ్స్ కొత్త ప్లాంట్... సీఎంను కలిసిన సంస్థ ప్రతినిధులు

  • బద్వేలులో సెంచరీ  ప్లైబోర్డ్స్ పరిశ్రమ
  • సీఎం జగన్ కు వివరాలు తెలిపిన సంస్థ వర్గాలు
  • 2024 నాటికి ప్లాంట్ పూర్తి
  • దాదాపు 9 వేలమందికి ఉపాధి
కడప జిల్లాలో మరో కొత్త పరిశ్రమ రాబోతోంది. బద్వేలులో సెంచరీ  ప్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నూతన ప్లాంట్ నెలకొల్పుతోంది. సెంచరీ  ప్లైబోర్డ్స్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ భజంకా, ఈడీ కేశవ్ భజంకా తదితరులు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ సంస్థ తాజా ప్రణాళికలను ఆయనకు వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ కూడా పాల్గొన్నారు.

ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడితో 3 దశల్లో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామని సెంచరీ  ప్లైబోర్డ్స్ ప్రతినిధులు సీఎం జగన్ కు వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా 3 వేల మందికి ప్రత్యక్ష, 6 వేల మందికి పరోక్ష ఉపాధి కలుగుతుందని తెలిపారు. రైతులతో యూకలిప్టస్ తోటల సాగును ప్రోత్సహించి, వాటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు చేయూతగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా, బద్వేలులో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ ప్లాంట్ 2024 డిసెంబరు నాటికి పూర్తికానుంది.


More Telugu News