ఇంతకీ.. అసలు మానిటైజేషన్ అంటే తెలుసా?.. రాహుల్ గాంధీపై ఆర్థిక మంత్రి చురకలు

  • ఎన్ఎంపీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత విమర్శలు
  • ప్రాజెక్టు కింద 25 ఎయిర్‌పోర్టులు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియాలు తదితరాల్లో ప్రైవేటు పెట్టుబడులు
  • దేశపు వనరులు అమ్ముకుంది కాంగ్రెస్ ప్రభుత్వమే: నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రారంభించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రాజెక్టు విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసిన ఈ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడి చేయడం ప్రారంభించాయి. ఈ దాడికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అందరి కన్నా ముందు నిలబడి నాయకత్వం వహిస్తున్నారు.

‘‘70 ఏళ్ల కాలంలో ప్రజాధనంతో నిర్మించిన కిరీట ఆభరభాల వంటి నిర్మాణాలను మోదీ ఇండస్ట్రియలిస్ట్ స్నేహితులకు అమ్మేయడానికే ఈ ప్రాజెక్టు’’ అంటూ ఆయన మండిపడ్డారు. అదే సమయంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలూ చేయలేదనే బీజేపీ విమర్శలపై కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన కట్టడాలనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అమ్ముకుంటోందని ఎత్తిచూపింది.

కాంగ్రెస్‌తోపాటు తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ వంటి విపక్ష పార్టీలు కూడా ఎన్ఎంపీకి వ్యతిరేకంగా గళం విప్పాయి. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. ‘‘అసలు మానిటైజేషన్ అంటే ఆయనకు (రాహుల్ గాంధీకి) తెలుసా?’’ అంటూ ఆమె చురకలేశారు. 'దేశ వనరులను అమ్ముకుని, ముడుపులు పోగేసుకున్నది కాంగ్రెస్ పార్టేనే'నని ఆమె మండిపడదారు.

 మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. ఈ ప్రాజెక్టుతో 6 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని, దీన్ని చూసి ఆ పార్టీ ఓర్వలేకే ఇలా విమర్శలు చేస్తోందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో ఏమైనా చేసుంటే.. రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచిన అమేథీలో ఇప్పటి వరకూ ఒక్క జిల్లా ఆస్పత్రి కూడా లేదేం? అని ఆమె ప్రశ్నించారు. అలాగే మరో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ కూడా ‘నాన్ పెర్ఫామింగ్ ఆస్తి’ అని ఎద్దేవా చేశారు. చివరగా ‘గుడ్ లక్ అండ్ గెట్ వెల్ సూన్’ (త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా) అంటూ ఎద్దేవా చేశారు.


More Telugu News