ఆఫ్ఘన్ సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ సుదీర్ఘ చర్చ

  • ఆఫ్ఘన్ లో మళ్లీ తాలిబన్ల పాలన
  • ఆందోళనలో ప్రపంచ దేశాలు
  • పరిష్కారం కోసం పుతిన్ తో మోదీ చర్చ
  • 45 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ
ఆఫ్ఘనిస్థాన్ లో మళ్లీ తాలిబన్లు అధికారం చేపట్టనుండడంపై ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘంగా చర్చించారు. ఆఫ్ఘన్ సంక్షోభానికి పరిష్కారంపై పుతిన్ తో ఫోన్ లో దాదాపు 45 నిమిషాల సేపు సమాలోచనలు జరిపారు. వీరి సంభాషణలో ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారమే ప్రధాన అజెండాగా ఉంది. దీనికి సంబంధించి ప్రధాని మోదీ ట్విట్టర్ లో వెల్లడించారు.

"ఆఫ్ఘనిస్థాన్ లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై నా మిత్రుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఎంతో ఉపయుక్తమైన, వివరణాత్మక సంభాషణ జరిపాను. అంతేకాకుండా భారత్-రష్యా ద్వైపాక్షిక అంశాలపైనా మాట్లాడుకున్నాం. కొవిడ్-19కు వ్యతిరేకంగా ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవడంపైనా చర్చించాం. కీలక అంశాలపై ఇకపైనా దేశాధినేతల స్థాయిలో చర్చలు జరపడం కొనసాగించాలని తీర్మానించాం" అని వివరణ ఇచ్చారు.


More Telugu News