అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో డ‌బ్బులు జమ చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్

  • రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన వారు 3.86 లక్షల మంది 
  • వారికి మొత్తం రూ.207.61 కోట్లు ఇస్తున్న‌ట్లు తెలిపిన జ‌గ‌న్
  • రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారు 3.14 లక్షల మంది
  • వారికి రూ.459.23 కోట్లు చెల్లించామన్న సీఎం
అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రూ.666.84 కోట్ల న‌గ‌దు జ‌మ చేశారు. ల‌క్ష‌లాది మంది బాధితుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. కష్టపడి సంపాదించుకున్న‌ సొమ్మును అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు నష్టపోయారని చెప్పారు.

ఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించామని, వారిని ఆదుకుంటున్నామ‌ని వైఎస్ జ‌గ‌న్ తెలిపారు. రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన 3.86 లక్షల మంది బాధితులకు రూ.207.61 కోట్లు ఇస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే, రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన 3.14 లక్షల మంది బాధితులకు రూ.459.23 కోట్లు చెల్లించామని వివ‌రించారు. 2019 నవంబరులో తొలి ద‌శ‌ కింద రూ.238 కోట్లు చెల్లించినట్లు చెప్పారు.  

మొత్తం 10.4 లక్షల మందికి రూ.905.57 కోట్లు ఇచ్చామ‌ని వైఎస్ జ‌గ‌న్ తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల‌ను ఆదుకుంటామ‌ని  ఎన్నికల ముందు ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు ప్ర‌భుత్వం ఇలా న్యాయం చేయ‌డం దేశంలో ఎక్కడా లేదని ఆయ‌న తెలిపారు.

ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా డ‌బ్బు చెల్లించిందని ముఖ్యమంత్రి అన్నారు. గ‌త టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారం పూర్తిగా తేల‌గానే మిగిలిన డిపాజిటర్లకు కూడా చెల్లింపులు ఉంటాయని వివ‌రించారు.


More Telugu News