గడువు సమీపిస్తోంది... ఈ లోపే వెళ్లిపోండి: అమెరికాను హెచ్చరించిన తాలిబన్లు

  • ఆగస్టు 31 కల్లా నిష్క్రమించాలని భావించిన అమెరికా
  • అమెరికా, ఇతర దేశాల పౌరుల తరలింపు ఆలస్యం
  • మరికొన్ని రోజులు ఆఫ్ఘన్ గడ్డపై ఉండే అవకాశం
  • కుదరదంటున్న తాలిబన్లు
ఆఫ్ఘనిస్థాన్ లో ప్రజాగ్రహం పెల్లుబుకుతోన్న సూచనలు కనిపిస్తుండడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు వేగంగా పావులు కదుపుతున్నారు. అయితే, ఆఫ్ఘన్ లో అమెరికా బలగాల ఉనికి పట్ల తాలిబన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు ప్రకటించినట్టుగా ఈ నెల 31 లోగా అమెరికన్లు ఆఫ్ఘన్ గడ్డపై నుంచి నిష్క్రమించాల్సిందేనని తాలిబన్ అధినాయకత్వం స్పష్టం చేసింది. అప్పటికి కూడా అమెరికా బలగాలు తమ దేశం వీడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో విదేశీయుల తరలింపు ప్రక్రియ ఏమంత వేగంగా సాగడంలేదు. అమెరికా బలగాలు, నాటో దళాలు, ఇతర దేశాల పౌరులను పూర్తిగా తరలించేందుకు వీలుగా మరికొన్నిరోజుల పాటు ఆఫ్ఘనిస్థాన్ లోనే ఉండే విషయం చర్చిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. వాస్తవానికి ఆగస్టు 31 కల్లా ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమించాలని బైడెన్ ఇంతకుముందు నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్ల తాజా హెచ్చరిక నేపథ్యంలో బైడెన్ ఏంచేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్థాన్ నుంచి 65 వేల మందిని తరలించాలన్నది జో బైడెన్ లక్ష్యంగా కనిపిస్తోంది. వారిలో అమెరికా పౌరులు, మిత్రదేశాలకు చెందినవారు ఉన్నారు. ఈ తరలింపు పూర్తయ్యేవరకు ఆఫ్ఘన్ గడ్డపైనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే గడువు పొడిగిస్తామని చెబుతున్నారు. తరలింపు ప్రక్రియలో కీలకంగా మారిన కాబూల్ ఎయిర్ పోర్టుకు 5,800 మంది అమెరికా సైనికులు భద్రత కల్పిస్తున్నారు. తమ విమానాల్లో ఎక్కేందుకు ఆఫ్ఘన్ పౌరులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడం అమెరికా, నాటో దళాలకు సమస్యాత్మకంగా మారింది. ఎయిర్ పోర్టు వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.


More Telugu News