వాహనాలను సీజ్‌ చేసే అధికారం ఉంది.. అదంతా తప్పుడు ప్రచారం: సైబ‌రాబాద్ పోలీసుల వివరణ

  • వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు పేర్కొందంటూ ప్రచారం  
  • హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్న పోలీసులు 
  • చలానా గురించి వాహనదారునికి ఒక్కసారి తెలియజేస్తే చాలు  
  • తనిఖీ చేసుకోవాల్సిన బాధ్యత వాహనదారులదేనన్న పోలీసులు  
ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే పోలీసులు చ‌లానాలు వేయడం, చలానా చెల్లించకుంటే వాహనాలను జప్తు చేయడం మనకు తెలిసిన విష‌యమే. అయితే, చలానాలు చెల్లించకుంటే వాహనాలను సీజ్‌ చేసే అధికారం మాత్రం ట్రాఫిక్‌ పోలీసులకు లేదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో ఇటీవ‌ల పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ప్ర‌చారం అవుతోన్న ఈ పోస్టులపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్ప‌ష్ట‌త‌నిచ్చారు.

 హైకోర్టు ఈ విషయంలో అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని తెలిపారు. ప్రజలను గందరగోళానికి గురి చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడ‌ద‌ని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించే వారి వాహనాలను సీజ్‌ చేసే అధికారం తమకు ఉంటుందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్ నిబంధ‌న‌లు–1989 రూల్‌ 167 ప్రకారం 90 రోజులకు పైగా ట్రాఫిక్‌ చలానాలు పెండింగ్‌ ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉందని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.  

చలానా గురించి వాహనదారునికి ఎలక్ట్రానిక్‌ రూపంలో లేదా కాల్‌ ద్వారా పోలీసులు ఒక్కసారైనా తెలియజేస్తే చాలని తెలిపారు. అలాగే, త‌మ వాహ‌నానికి ఏమైనా ట్రాఫిక్‌ ఉల్లంఘన చలానాలు ఉన్నాయా? అని తనిఖీ చేసుకోవాల్సిన బాధ్యత వాహనదారులదేన‌ని స్పష్టం చేశారు.


More Telugu News