కానిస్టేబుల్ అత్యాచారం వార్తలు నమ్మొద్దన్న గుంటూరు ఎస్పీ.. లోకేశ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న పోలీసు సంఘం

  • చిన్నారిపై అత్యాచారయత్నం జరగలేదని తల్లిదండ్రులు చెప్పారన్న ఎస్పీ
  • లోకేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న పోలీసు సంఘం
  • పోలీసుల మనోభావాలను లోకేశ్ దెబ్బతీయలేదన్న చినరాజప్ప
బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కోరారు. నిన్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని కొట్టిపడేశారు. ఇలాంటి వార్తల వల్ల బాలిక కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అయితే, తాను బాధిత బాలిక తల్లిదండ్రులతో మాట్లాడానని, చిన్నారిపై అత్యాచారయత్నం జరగలేదని వారు చెప్పారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ తమ కుమార్తెతో చనువుగా వ్యవహరిస్తుండడంతో మందలించి ఫిర్యాదు చేసినట్టు వారు చెప్పారని ఎస్పీ వివరించారు.

మరోవైపు కానిస్టేబుల్ రమేశ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేసిన ఆరోపణలు సరికాదని ఏపీ పోలీసు అధికారుల సంఘం పేర్కొంది. ఈ ఘటనను లోకేశ్ రాజకీయంగా వాడుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. లోకేశ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంకోపక్క, పోలీసు సంఘం వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప స్పందించారు. పోలీసు సంఘం చేసిన ప్రకటన నేరం చేసిన పోలీసులను రక్షించేలా ఉందని మండిపడ్డారు. పోలీసుల మనోభావాలను లోకేశ్ దెబ్బతీయలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవవుతున్నాయని మాత్రమే అన్నారని చినరాజప్ప పేర్కొన్నారు.


More Telugu News