నేడు రాయలసీమలో భారీ వర్షాలకు అవకాశం

  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం
  • రేపు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వానలు
  • నిన్న కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతల నమోదు
ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో నేడు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు (మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఇక, రాజస్థాన్ నుంచి శ్రీలంక వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి బలహీన పడిందని, అరేబియా సముద్రం వైపు నుంచి వీస్తున్న పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావం రాష్ట్రంపై ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవగా, కొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాలలో 37 నుంచి 39 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికమని అధికారులు తెలిపారు.


More Telugu News