ఆస్ట్రేలియాలో లాక్‌డౌన్‌ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకం.. 250 మంది అరెస్ట్

  • సిడ్నీలో రెండు నెలలుగా లాక్‌డౌన్ 
  • మెల్‌బోర్న్, కాన్‌బెర్రాలలో ఈ నెల నుంచి
  • లాక్‌డౌన్‌లకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజలు
  • ఘర్షణల్లో ఏడుగురు పోలీసులకు గాయాలు
కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఆస్ట్రేలియా లో చేపడతున్న లాక్‌డౌన్‌లను నిరసిస్తూ ప్రజలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. సిడ్నీలో రెండు నెలలుగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా, మెల్‌బోర్న్, రాజధాని కాన్‌బెర్రాలలో ఈ నెలలో లాక్‌డౌన్ విధించారు. అయితే, ఈ లాక్‌డౌన్ల కారణంగా మళ్లీ ఇబ్బందులు మొదలు కావడంతో ప్రజలు వీటికి వ్యతిరేకంగా గళమెత్తారు.

తక్షణం లాక్‌డౌన్‌లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిన్న ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మెల్‌బోర్న్‌లో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పలు చోట్ల ఘర్షణలు రేకెత్తాయి. ఈ ఘటనల్లో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. అలాగే, నిరసన చేట్టిన దాదాపు 250 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకే లాక్‌డౌన్‌లు విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.


More Telugu News