లక్షలు సంపాదిస్తున్న ‘యూట్యూబ్ విలేజ్’.. అంతా ఆ మెకానిక్ చలవే!

  • నాలుగేళ్లలో కోటీశ్వరుడైన సిస్వాంతో
  • క్షుద్రపూజలు చేస్తున్నాడని పుకార్లు
  • ఊరు మొత్తానికి యూట్యూబ్ తరగతులు
  • ఇప్పుడు గ్రామం అంతా యూట్యూబ్ స్టార్లే
  • స్పీడ్ ఇంటర్నెట్‌తో పిల్లల చదువులకు లేని ఇబ్బందులు


అతడి పేరు.. సిస్వాంతో. ఉండేది ఇండోనేషియాలోని ఓ చిన్న గ్రామంలో! అతడో బడుగు జీవి. బైక్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. అసలే ఎదుగూబొదుగూ లేని జీవితం. ఆపై కరోనా కష్టకాలం. దీంతో..పూట గడవటమే కష్టంగా మారింది. మరోవైపు.. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ కుటుంబ ఖర్చులూ పెరుగుతున్నాయి. దీంతో..అతడికి ఏం చేయాలో పాలు పోలేదు. అంతకు మునుపు సిస్వాంతో యూట్యూబ్ గురించి, దాని ద్వారా వచ్చే ఆదాయం గురించి విన్నాడు. ఈ మార్గంలో ఓ వ్యక్తి యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి లక్షల రూపాయలు ఆర్జించినట్టు ఓ టీవీ ప్రోగ్రామ్‌లో చూశాడు. దీంతో.. తనూ యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ఆరంభంలో అతడి వీడియోలను ఎవ్వరూ చూడలేదు. కొన్ని నెలల పాటు వ్యూస్ కోసం ప్రయత్నించిన అతడు చివరకు తనకు రాసిపెట్టి లేదనుకుని యూట్యూబ్ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
 
ఈ క్రమంలో ఓ రోజు అతడి మెకానిక్ షాపుకు బైక్ రిపేర్ కోసం ఓ వ్యక్తి వచ్చాడు. అతడు తన వెంట ఓ ఖరీదైన బైక్ తెచ్చాడు. దాన్ని రిపేర్ చేసేందుకు అతడు స్వయంగా యూట్యూబ్‌ వీడియోలను చూడాల్సి వచ్చింది. అయితే..ఈ వీడియోలు టెక్నికల్‌గా ఉండటంతో అతడు కూడా అర్థం చేసుకోలేక అవస్థపడ్డాడు. ఈ క్రమంలో బైక్ రిపేర్ వీడియోలను మరింత సులభంగా అందరికీ అర్థమయ్యేలా రికార్డు చేయాలని అతడికి తోచింది. అదిగో అలా మళ్లీ ప్రారంభమైంది అతడి యూట్యూబ్ ప్రస్థానం. అయితే ఈ మారు మాత్రం అతడు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అతడి ఛానల్ బాగా పాపులర్ అవడంతో.. యూట్యూబ్ ఆదాయం పెరిగి అతడి కష్టాలు తీరిపోయాయి.

ఈ క్రమంలో అతడు లక్షలు కళ్లచూశాడు. కేవలం నాలుగేళ్లలో అతడు ఎదిగిన తీరు చూసి గ్రామస్థుల్లో అపోహలు బయలు దేరాయి. అతడు క్షుద్రపూజలు చేస్తున్నాడని కూడా పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఓ రోజు అతడు గ్రామస్థులందరినీ కూర్చోబెట్టి యూట్యూబ్ గురించి చెప్పి వారికి శిక్షణ ఇవ్వడంతో వారు కూడా ఇదే బాట పట్టారు. ప్రస్తుతం గ్రామంలో అధికశాతం మంది యూట్యూబ్ బాట పట్టి తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడంతో ప్రస్తుతం ఆ గ్రామానికి 'యూట్యూబ్ విలేజ్' అన్న పేరుపడింది. ఇలా గ్రామంలో అందరి ఆర్థిక స్థితి మెరుగుపడటంతో.. ఆ గ్రామస్థులు వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. ప్రస్తుత కరోనా సమయంలో గ్రామంలోని పిల్లలు ఎటువంటి ఇంటర్నెట్ ఇబ్బందులూ లేకుండా తమ చదువులు కొనసాగిస్తున్నారు.



More Telugu News