రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్‌కోచ్‌ నిష్క్రమణ!

  • వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న సైమన్ కాటిచ్
  • ఈ సీజన్ వరకూ కోచ్‌గా మైక్ హెసాన్
  • ప్రకటించిన ఆర్‌సీబీ యాజమాన్యం
  • సెప్టెంబరు 20న కోల్‌కతాతో మ్యాచ్
కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా ఈ క్రికెట్ పండుగ రెండో భాగం మళ్లీ మొదలయ్యే సమయంలో విరాట్ కోహ్లీ సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో తాను తప్పుకుంటున్నట్లు జట్టు హెడ్ కోచ్ సైమన్ కాటిచ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఉన్న మైక్ హెసాన్.. కోచ్ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.

ఈ విషయాన్ని జట్టు ఉపాధ్యక్షుడు రాజేష్ మీనన్ వెల్లడించారు. ఇంతకాలం జట్టుకు చేసిన సేవలకుగాను కాటిచ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో జట్టు నుంచి వెళ్లిపోయిన ఆడమ్ జంపా స్థానంలో.. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగను తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆప్ ది సిరీస్’గా నిలిచిన హసరంగ.. 3 మ్యాచుల్లో 5.58 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు.

హసరంగతోపాటు మరో శ్రీలంక ఆటగాడు దుష్మంత చమీరా కూడా బెంగళూరు జట్టుతో చేరనున్నాడు. ప్రపంచంలోని వివిధ టీ20 లీగ్‌లలో తన హార్డ్ హిట్టింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న టిమ్ డేవిడ్ కూడా ఆర్‌సీబీతో కలవనున్నట్లు రాజేష్ మీనన్ తెలిపారు. కాగా, యూఏఈలో ప్రారంభం కానున్న ఐపీఎల్-14 రెండో అర్థభాగంలో ఆర్‌సీబీ ప్రయాణం సెప్టెంబరు 20న ప్రారంభం కానుంది. ఆరోజున కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుతో అబుధాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం వేదికగా బెంగళూరు తలపడనుంది.


More Telugu News