యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసు వివరాలు ఇవిగో!

  • తండ్రి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు
  • నిందితులుగా ఐదుగురు
  • వారిలో ముగ్గురు మహిళలు
  • ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ పరారీ
విజయవాడలో ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ కారులో శవమై తేలడం సంచలనం సృష్టించింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది హత్య అని వెల్లడైంది. దీనిపై రాహుల్ తండ్రి కరణం రాఘవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన కోరాడ విజయ్, రాహుల్ కలిసి వ్యాపారం చేసేవారు.

గత ఎన్నికల్లో పోటీచేసిన కోరాడ విజయ్ ఓటమిపాలవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో తన షేర్లు తీసుకుని డబ్బు ఇవ్వాలంటూ రాహుల్ ను కోరాడు. అందుకు రాహుల్ అంగీకరించలేదు. అంతేకాకుండా తాము స్థాపించిన కంపెనీని కోగంటి సత్యంకు అమ్మాలని రాహుల్ వద్ద ప్రతిపాదించాడు. అందుకు కూడా రాహుల్ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో రాహుల్ పై కోరాడ విజయ్, కోగంటి సత్యం, కోరాడ పద్మజ, గాయత్రి ఒత్తిడి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో, పనుందంటూ బయటికి వెళ్లిన రాహుల్ తిరిగిరాలేదు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో ఏ1గా కోరాడ విజయ్, ఏ2గా కోగంటి సత్యం, ఏ3గా కోరాడ విజయ్ అర్ధాంగి పద్మజ, ఏ4గా పద్మజ, ఏ5గా  గాయత్రిల పేర్లను పేర్కొన్నారు. ప్రస్తుతం కోరాడ విజయ్ పరారీలో ఉన్నాడు. అతడు బెంగళూరులో ఉన్నట్టు భావిస్తున్నారు. పోలీసు బృందాలు గాలింపు జరుపుతున్నాయి.

ఈ ఘటనపై కోగంటి సత్యం స్పందిస్తూ ఫ్యాక్టరీ అమ్మకానికి ఉందంటేనే తాను వెళ్లానని, రాహుల్ మృతితో తనకు సంబంధంలేదని స్పష్టం చేశారు. పోలీసులకు విచారణలో సహకరిస్తానని చెప్పారు. 


More Telugu News