పెటా విన్నపం మేరకు గ్లూ ట్రాప్ లపై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం

  • ఎలుకలను పట్టుకునేందుకు వినియోగిస్తున్న గ్లూ ట్రాప్ లు
  • నిషేధాన్ని విధించాలని ప్రభుత్వాన్ని కోరిన పెటా
  • మూగజీవాలు తీవ్ర హింసకు గురవుతున్నాయన్న పెటా
ఎలుకల బెడద ఉండేవాళ్లు వాటిని పట్టుకునేందుకు గ్లూ ట్రాప్ లను వినియోగిస్తుంటారు. ఈ ట్రాప్ లో అడుగుపెట్టే ఎలుకలు గ్లూ (జిగురు)కి అతుక్కుపోతాయి. ఈ ట్రాప్ లలో పిల్లులు, పక్షులు, బల్లులు తదితర జీవులు కూడా పడుతున్నాయి. ఆ తర్వాత జిగురు నుంచి విడిపించుకోవడం వాటి వల్ల కాదు. ఈ నేపథ్యంలో, గ్లూ ట్రాప్ లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. గ్లూ తయారీ, అమ్మకాలు, వాడకాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.

పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) విన్నపం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్లూ ట్రాప్ వల్ల మూగజీవాలు తీవ్రమైన హింసకు గురవుతున్నాయని... అందువల్ల వీటిని వెంటనే నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పెటా ప్రతినిధులు కోరారు. గ్లూ ట్రాప్ అక్రమ వాడకాన్ని నిషేధిస్తూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసేందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గ్లూ ట్రాప్ లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.


More Telugu News