తాలిబన్లతో కలిసి పని చేసేందుకు సిద్ధమంటూ బ్రిటన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

  • ఆఫ్ఘన్ సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు అవసరమైతే కలిసి పని చేస్తాం
  • రాజకీయ, దౌత్యపరమైన చర్యలు చేపడతాం
  • కాబూల్ ఎయిర్ పోర్టులో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి
ఆప్ఘనిస్థాన్ ను అధీనంలోకి తీసుకున్న తాలిబన్లతో కలిసి పని చేసేందుకు తమకు అభ్యంతరం లేదని ఇప్పటికే చైనా ప్రకటించింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా మద్దతు ప్రకటించారు. రష్యా కూడా తాలిబన్లకు అనుకూలంగానే మాట్లాడింది. ఇప్పుడు తాజాగా మరో అగ్రరాజ్యం తాలిబన్లకు ఊరట కలిగించే వ్యాఖ్యలు చేసింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభానికి పరిష్కారాన్ని చూపేందుకు అవసరమైతే తాలిబన్లతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు అవసరమైతే రాజకీయ, దౌత్యపరమైన చర్యలను చేపడతామని చెప్పారు.

కాబూల్ ఎయిర్ పోర్టులో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. కాబూల్ నుంచి ఇప్పటి వరకు 1,165 మందిని బ్రిటన్ కు తరలించామని... వీరిలో బ్రిటన్ పౌరులు 399 మంది కాగా... రాయబార కార్యాలయ సిబ్బంది 320 మంది, ఆఫ్ఘన్లు 402 మంది ఉన్నారని చెప్పారు. ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో బోరిస్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


More Telugu News