హుజూరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థిగా కొండా సురేఖ.. ఒకట్రెండు రోజుల్లో ప్రకటన!

  • ముగ్గురి పేర్లతో దామోదర రాజనర్సింహ నివేదిక
  • టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అందజేత
  • ఆ నివేదికతో ఢిల్లీకి వెళ్లనున్న మాణిక్కం ఠాగూర్
టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చాక.. ఎమ్మెల్యేగా రాజీనామా చేశాక హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు అనివార్యమైపోయాయి. బీజేపీలో చేరిన ఆయన అభ్యర్థిత్వం ఖరారైపోయినట్టే. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఇటీవలే అధికార టీఆర్ఎస్ ప్రకటించేసింది. పోటీలో నిలిచేది ఎవరైనా ఆ పోరు కేసీఆర్, ఈటల మధ్యే అన్నట్టుగా హోరాహోరీ నడుస్తోందిప్పుడు.

అయితే, ఇన్నాళ్లవుతున్నా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నదానిపై క్లారిటీ రాలేదు. తాజాగా అది ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కొండా సురేఖను అక్కడి నుంచి బరిలోకి దింపనున్నట్టు సమాచారం. ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయినట్టు చెబుతున్నారు. అభ్యర్థి ఎంపికపై ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ కసరత్తును పూర్తి చేశారు.

ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి ముగ్గురి పేర్లతో తుది జాబితాను ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అందజేశారు. ఆ నివేదికలో కొండా సురేఖ పేరునూ ప్రస్తావించారని చెబుతున్నారు. ఆ నివేదికతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ఆమోదం తర్వాత ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.


More Telugu News