ఆఫ్ఘన్ లో జర్నలిస్టులను వేటాడుతున్న తాలిబన్లు

  • ఆఫ్ఘన్ లో మొదలైన తాలిబన్ అరాచకం
  • పాత్రికేయులకు గడ్డుకాలం
  • ఇంటింటికీ తిరిగి గాలిస్తున్న తాలిబన్లు
  • కాల్పుల్లో ఓ జర్నలిస్టు బంధువు మృతి
పాశ్చాత్య మీడియా సంస్థల తరఫున ఆఫ్ఘనిస్థాన్ లో వార్తాసేకరణ జరుపుతున్న పాత్రికేయుల కోసం తాలిబన్లు వేటాడుతున్నారు. రాజధాని కాబూల్ తో పాటు ఇతర ప్రావిన్స్ ల్లోనూ విదేశీ మీడియా ప్రతినిధుల కోసం తీవ్రస్థాయిలో గాలింపు జరుపుతున్నారు.

తాజాగా డీడబ్ల్యూ (డాట్షూ వెల్లే) అనే జర్మన్ టీవీ చానల్ ప్రతినిధి కోసం కాబూల్ లో ఇంటింటికీ తిరిగి గాలించారు. అతడు దొరక్కపోయేసరికి, అతడి బంధువులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు పాత్రికేయుడి బంధువు ఒకరు మృతి చెందగా, మరో బంధువు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతరులు తప్పించుకున్నారు.

ఈ ఘటనను డీడబ్ల్యూ చానల్ డైరెక్టర్ జనరల్ పీటర్ లింబోర్గ్ ఖండించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పాత్రికేయులు, వారి కుటుంబసభ్యులు ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్టు ఈ ఘటన చాటుతోందని వ్యాఖ్యానించారు. కాగా, కాబూల్ లో డీడబ్ల్యూ చానల్ కోసం పనిచేస్తున్న ఇతర జర్నలిస్టుల ఇళ్లపైనా తాలిబన్లు దాడులు చేసినట్టు చానల్ వర్గాలు తెలిపాయి. అమెరికా, నాటో దళాలకు సహాయ సహకారాలు అందించిన వారిని కూడా తాలిబన్లు వేటాడుతున్నారు.


More Telugu News