విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై సీఎం జగన్ ఆరా

  • కాబోయే భార్యకు నిప్పంటించిన యువకుడు  
  • మరో యువకుడితో మాట్లాడుతోందని ఆగ్రహం
  • చికిత్స పొందుతున్న యువతి
  • బాధితురాలిని విశాఖ తరలించాలన్న సీఎం జగన్
ఇటీవలే గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు మరువక ముందే విజయనగరం జిల్లాలో రాంబాబు అనే యువకుడి ఉన్మాదం కలకలం రేపింది. మరో యువకుడితో మాట్లాడుతోందన్న కారణంతో కాబోయే భార్యపైనే పెట్రోల్ పోసి నిప్పంటించడం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు రాములమ్మ ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

బాధితురాలికి మరింత మెరుగైన వైద్యం అందించాలని, ఆమెను విశాఖ తరలించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో బాధితురాలు రాములమ్మను విశాఖ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు, ఈ వ్యవహారంలో సీఎం జగన్ మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా దిశానిర్దేశం చేశారు. రాములమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించాలని, వారికి అండగా నిలవాలని తెలిపారు. బాధితురాలికి అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తుండాలని స్పష్టం చేశారు.

సీఎం ఆదేశాలతో బొత్సతో పాటు ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, అధికారులు బాధితురాలిని పరామర్శించారు. కాగా, ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె సోదరి, సోదరి కుమారుడికి కూడా గాయాలయ్యాయి.


More Telugu News