జగన్ ప్రభుత్వ స్థాయిలోనే కేంద్రం కూడా అప్పులు చేసింది: రామకృష్ణ

  • కార్పొరేట్ శక్తులకు మేలు చేయడమే మోదీ పాలన
  • మోదీ వల్ల అదానీ టాప్ బిలియనీర్ అయ్యారు
  • దేశ అప్పులను మోదీ రూ. 119 లక్షల కోట్లకు తీసుకెళ్లారు
కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రం అనుకున్న బిల్లులన్నింటినీ పార్లమెంటులో ఎలాంటి చర్చ కూడా లేకుండానే ఆమోదింపజేసుకుంటున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఈ విధానంపై ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. కానీ, కేంద్ర మంత్రులు మాత్రం మోదీని తెగ పొగిడేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కార్పొరేట్ శక్తులకు మేలు చేయడమే మోదీ పాలన అని రామకృష్ణ అన్నారు. కరోనా సమయంలో కేవలం అంబానీ, అదానీల ఆస్తులు మాత్రమే రెట్టింపయ్యాయని చెప్పారు. 2014కు ముందు అదానీ ఎవరో చాలా మందికి తెలియదని... కానీ, ఇప్పుడు ఆయన టాప్ బిలియనీర్ అయ్యారని అన్నారు.

మోదీ ప్రధాని అయ్యే సమయంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 62 మాత్రమే ఉండేదని... ఇప్పుడు రూ. 108కి చేరిందని దుయ్యబట్టారు. పెరిగిన ధరల పట్ల విపక్షాలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలను చేపడుతుంటే... బీజేపీ నేతలు సిగ్గు లేకుండా అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్లను కూడా సకాలంలో అందించలేక కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని అన్నారు.

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని... పైనున్న కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో అప్పులు చేసిందని చెప్పారు. మోదీ దేశ అప్పులను రూ. 47 లక్షల కోట్ల నుంచి రూ. 119 లక్షల కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు. సాధారణ ప్రజలను మోదీ ప్రభుత్వం గాలికొదిలేసిందని చెప్పారు. బీజేపీ చేయాల్సింది జన ఆశీర్వాద యాత్ర కాదని... జన వంచన యాత్ర చేయాలని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని... అయినా అన్నీ చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెపుతుండటం దారుణమని అన్నారు. ఏపీకి ఎవరూ చేయనంత అన్యాయాన్ని మోదీ చేశారని మండిపడ్డారు.


More Telugu News