అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువ‌కుడు

  • అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి గాయాలు
  • విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆసుప‌త్రికి ముగ్గురు బాధితుల త‌ర‌లింపు
  • నిందితుడు న‌ర‌వ‌కు చెందిన  రాంబాబుగా గుర్తింపు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించి క‌ల‌క‌లం రేపాడు ఓ యువ‌కుడు. దీంతో ఆ యువ‌కుడిని అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి.

వెంట‌నే స్థానికులు, బాధితులు ముగ్గురిని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించి, నిందితుడు న‌ర‌వ‌కు చెందిన రాంబాబుగా గుర్తించారు. ఇటీవ‌ల సదరు యువ‌తితో రాంబాబుకు వివాహం నిశ్చ‌య‌మైంది. అయితే, ఆ యువ‌తి మ‌రో యువ‌కుడితో మాట్లాడుతోంద‌ని రాంబాబు ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. చివ‌ర‌కు పెళ్లి ర‌ద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు.

దీంతో ఇరు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ చెల‌రేగింది. నిన్న రాత్రి ఇరు కుటుంబాల‌ను పిలిచి పోలీసులు రాజీ కుద‌ర్చ‌డంతో పోలీసుల సూచ‌న‌ల‌తో వివాహం చేసుకునేందుకు రాంబాబు ఒప్పుకున్నాడు. అయితే, మ‌ళ్లీ ఇంతలోనే ఏం జ‌రిగిందో కానీ, నిన్న అర్ధ‌రాత్రి స‌మ‌యంలో యువ‌తిపై దారుణానికి పాల్ప‌డ్డాడు రాంబాబు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉంది.


More Telugu News