తాలిబన్ల వ్యవహారం.. ఒవైసీపై మండిపడ్డ విజయశాంతి

  • తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలన్న ఒవైసీ
  • ఆ దేశ ఉపాధ్యక్షుడు ఇంకా పోరాడుతున్నారన్న విజయశాంతి
  • ఒవైసీ స్వయంగా కాబూల్ వెళ్లి చర్చలు జరపాలని ఎద్దేవా
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. గతానికి భిన్నంగా తాము పాలిస్తామని, మహిళల హక్కులను కూడా కాపాడతామని తాలిబన్ నేతలు చేసిన వాగ్దానాలు... ఆచరణలో మాత్రం వాస్తవరూపం దాల్చడం లేదు. పలుచోట్ల తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో ఒవైసీపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. భారత్ లో ఉన్న ఆఫ్ఘన్ రాయబారి తాలిబన్లను వ్యతిరేకిస్తున్నారని... ఆ దేశ ఉపాధ్యక్షుడు ఇంకా పోరాడుతున్నారని... అలాంటప్పుడు తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థం ఏమిటో ఒవైసీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు.

ఒవైసీ స్వయంగా కాబూల్ కు వెళ్లి, తాలిబన్లతో చర్చలు జరిపి, సమాచారం అందిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో సమంజసంగా ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ యూఏఈలో తలదాచుకున్న సంగతి తెలిసిందే.


More Telugu News