షూ కూడా మార్చుకోలేదు.. ఆరోపణలపై స్పందించిన ఘనీ

  • చెప్పులు విప్పి బూట్లు ధరించే సమయం కూడా లేకుండా పోయింది
  • రక్తపాతం జరగకూడదనే కాబూల్‌ను విడిచిపెట్టా
  • అక్కడే ఉండి ఉంటే ఉరితీసేవారు
  • యూఏఈలో ప్రవాస జీవితం గడపాలని లేదు
ఆఫ్ఘనిస్థాన్ నుంచి తాను రూ. 1,255 కోట్లతో పరారైనట్టు తజకిస్థాన్‌లోని ఆఫ్ఘనిస్థాన్ రాయబారి చేసిన ఆరోపణలను ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఖండించారు. తనకు ఆశ్రయమిచ్చిన యూఏఈ నుంచి ఆయన పేస్‌బుక్‌ ద్వారా పలు విషయాలను వెల్లడించారు.

నాలుగు కార్లు, హెలికాప్టర్ నిండా డబ్బులతో పరారైనట్టు వచ్చిన వార్తలపై స్పందించిన ఆయన.. ఈ ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదన్నారు. రక్తపాతం జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను కాబూల్‌ను విడిచిపెట్టినట్టు చెప్పారు. ఆ సమయంలో తనకు బూట్లు ధరించే సమయం కూడా లేకుండా పోయిందని, చెప్పులతోనే ఆదివారం అధ్యక్ష భవనాన్ని విడిచిపెట్టినట్టు చెప్పారు.

‘‘అధ్యక్షుడు మిమ్మల్ని అమ్మేసి తన దారి తాను చూసుకున్నాడంటూ ఎవరేం చెప్పినా నమ్మకండి. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవం. నేను వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని ఘనీ స్పష్టం చేశారు. చెప్పులు విప్పి షూ వేసుకునే సమయం కూడా తనకు లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దుబాయ్‌లోనే ప్రవాస జీవితం గడపాలని తనకు లేదని, స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నానని పేర్కొన్నారు. తాను కాబూల్‌లోనే ఉండి ఉంటే ఉరితీసేవారని అన్నారు. ‘‘నేను కనుక అక్కడే ఉండి ఉంటే ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తనను ఆఫ్ఘన్ ప్రజల కళ్లముందే ఉరితీసేవారని ఘనీ పేర్కొన్నారు.


More Telugu News