చిన్నారులకు టీకా.. రెండు నెలల్లో అందుబాటులోకి: భారత్ బయోటెక్

  • రెండేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్
  • క్లినికల్ ట్రయల్స్‌లో సంతృప్తికర ఫలితాలు
  • కొవిడ్, రేబిస్ రెండింటికీ ఒకే టీకా తెచ్చే యోచన
కొవాగ్జిన్ పేరుతో కరోనా టీకాలు ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు నెలల్లో చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ‘ఎఫ్ఐ హెల్త్ కేర్ సమ్మిట్’లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ టీకాను రెండు నుంచి 18 ఏళ్లలోపు వారికి ఇవ్వొచ్చని, ఇప్పటికే నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు.

టీకా పూర్తి భద్రత ఇస్తుందని ఇప్పటికే స్పష్టమైందని, రోగ నిరోధకశక్తి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు కృష్ణ ఎల్ల తెలిపారు. ఈ టీకాకు సంబంధించి మరో నెల రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. టీకా క్లినికల్ ట్రయల్స్‌పై భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) సంతృప్తి చెందితే టీకాకు అనుమతి లభిస్తుందని, ఇదంతా జరిగేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చని తెలిపారు. అలాగే, కొవిడ్, రేబిస్ రెండింటికీ కలిపి ఒకే టీకా ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.


More Telugu News