పెగాసస్ స్కామ్.. బెంగాల్ ప్రభుత్వ విచారణ కమిషన్ పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

  • పెగాసస్ పై విచారణకు ద్విసభ్య కమిషన్ వేసిన బెంగాల్ ప్రభుత్వం
  • కమిషన్ విచారణను నిలిపివేయాలంటూ దాఖలైన పిల్
  • తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా
పెగాసస్ స్కామ్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించింది. విపక్ష నేతలతో పాటు, ఇతరుల ఫోన్లపై ఈ స్పైవేర్ ద్వారా నిఘా ఉంచారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశం పార్లమెంటును సైతం కుదిపేసింది. మరోవైపు పెగాసస్ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పకపోవడం, విచారణ జరిపించకపోవడంతో... పశ్చిమబెంగాల్ ప్రభుతం ఈ అంశంలో విచారణకు గాను ద్విసభ్య కమిషన్ వేసింది.

ఈ నేపథ్యంలో, ద్విసభ్య కమిషన్ విచారణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... ఇద్దరు సభ్యుల కమిషన్ విచారణను నిలుపుదల చేయాలనే అభ్యర్థనను తోసి పుచ్చింది. మరోవైపు కమిషన్ ఏర్పాటుపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. పెగాసస్ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి ఈ పిల్ పై విచారణ జరుపుతామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు.


More Telugu News