సునంద పుష్క‌ర్ మృతి కేసులో శ‌శిథ‌రూర్‌ కు ఊర‌ట‌.. అభియోగాల కొట్టివేత‌

  • 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్‌లో సునందా పుష్కర్ మృతి
  • ఆత్మ‌హ‌త్య అని తేల్చిన పోలీసులు
  • శశిథ‌రూర్ వ‌ల్లే బ‌ల‌వ‌న్మ‌ర‌ణ‌మ‌ని అభియోగాలు
సునంద పుష్క‌ర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌కు ఢిల్లీ సెష‌న్స్‌ కోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో శ‌శిథ‌రూర్‌పై ఉన్న అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేసింది. 2014, జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్‌లో సునందా పుష్కర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

ఆమె ఆత్మహత్య చేసుకోవ‌డానికి ఓ ర‌కంగా శ‌శిథరూరే కార‌ణ‌మ‌య్యార‌ని 2018లో పోలీసులు చార్జ్‌షీట్ దాఖ‌లు చేశారు. ఆమె మృతి చెంద‌డానికి ముందు ఆమె చేసిన మెయిల్స్‌తో పాటు సామాజిక మాధ్య‌మాల్లో చేసిన పోస్టుల‌ను పోలీసులు అప్ప‌ట్లో ప‌రిశీలించారు. త‌న‌కు బ‌త‌కాల‌ని లేద‌ని, మృతి చెంద‌డానికి వారం రోజుల ముందు శ‌శిథ‌రూర్‌కి ఆమె ఓ మెయిల్ పంపార‌ని అప్ప‌ట్లో పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఆమె అప్ప‌ట్లో బ‌స చేసిన హోట‌ల్‌లో పోలీసుల‌కు 27 అల్‌ప్రాక్స్ మాత్ర‌లు కూడా ల‌భ్య‌మ‌య్యాయి. శ‌శిథ‌రూర్‌, సునంద పుష్క‌ర్‌కు 2010లో వివాహం జ‌రిగింది. గొడ‌వ‌ల కార‌ణంగా సునంద పుష్క‌ర్ యాంటీ-డిప్రెష‌న్ మాత్ర‌లు తీసుకునే వార‌ని అప్ప‌ట్లో పోలీసులు తెలిపారు. ఈ కార‌ణాల వ‌ల్ల శ‌శిథ‌రూర్‌పై అభియోగాలు న‌మోదు చేశారు. చివ‌ర‌కు ఆయ‌న‌కు సెష‌న్స్ కోర్టులో ఊర‌ట ల‌భించింది.


More Telugu News