కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రధాన సవాలుగా మారాయి: కేంద్రమంత్రి జై శంకర్

  • ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలన
  • స్వదేశానికి భారత పౌరులు
  • ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్న జై శంకర్
  • ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ వివరాల వెల్లడి
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ పాలన మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలో, స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారికి కాబూల్ విమానాశ్రయంలో ఎదురవుతున్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు తిరిగి రావాలనుకునే వారి ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, కానీ కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రధాన సవాలుగా మారాయని పేర్కొన్నారు. ఈ అంశంలో ఆఫ్ఘన్ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

కాబూల్ లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వివరించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఓ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాబూల్ లో ఉన్న సిక్కులు, హిందూ సంఘాల నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, భారత పౌరుల సంక్షేమమే తమకు ప్రథమ ప్రాధాన్యత అని జై శంకర్ ఉద్ఘాటించారు.

కాబూల్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారతీయుల గురించి కచ్చితమైన సమాచారం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎవరివద్ద అయినా కీలక సమాచారం ఉంటే 919717785379 ఫోన్ నెంబరుకు గానీ, MEAHelpdeskIndia@gmail.com ఈమెయిల్ ఐడీకి గానీ అందించాలని సూచించారు.


More Telugu News