6 నెలల్లో తొలి కరోనా కేసు నమోదు.. 3 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన న్యూజిలాండ్

  • ఆక్లండ్ లోని 58 ఏళ్ల వ్యక్తికి కరోనా
  • తక్షణమే కఠిన నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవన్న ప్రధాని
  • ఆస్ట్రేలియా ఇబ్బందులను చూడాలని సూచన
ఆరు నెలల తర్వాత న్యూజిలాండ్ లో తొలి కరోనా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆ దేశం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మాట్లాడుతూ, ఈ కేసును డెల్టా వేరియంట్ గా అనుమానిస్తున్నట్టు చెప్పారు. గత ఆరు నెలలుగా ఒక్క కరోనా కేసు నమోదు కానప్పటికీ... డెల్టా వేరియంట్ నేపథ్యంలో ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని అన్నారు. తక్షణమే మనం స్పందించని పక్షంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని... ఇతర దేశాలను చూసి తెలుసుకోవచ్చని చెప్పారు.

డెల్టా వేరియంట్ బారిన పడకుండా ఉండేందుకు మనకు కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుందని అన్నారు. డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతూ... ఈ వేరియంట్ వల్ల ఆస్ట్రేలియా పడుతున్న ఇబ్బందులను జెసిండా ఉదహరించారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం వల్లే కరోనాను మనం కట్టడి చేయగలిగామని చెప్పారు. అదే మనల్ని కాపాడిందని తెలిపారు. ప్రారంభంలోనే లాక్ డౌన్ విధించడం వల్ల కొన్ని రోజులు మాత్రమే మనకు ఇబ్బంది ఉంటుందని... అలసత్యం ప్రదర్శించి, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువ కాలం పాటు లాక్ డౌన్ లో ఉండాల్సి వస్తుందని చెప్పారు.

న్యూజిలాండ్ లోని ఆక్లండ్ నగరంలోని ఓ 58 ఏళ్ల వ్యక్తిలో డెల్టా వేరియంట్ ను గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రారంభ దశలో మూడు రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఆక్లండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఆంక్షలు విధించారు. కరోనా కట్టడిలో న్యూజిలాండ్ ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకుంది. దాదాపు 50 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటి వరకు కరోనా వల్ల కేవలం 26 మంది మాత్రమే చనిపోయారు.


More Telugu News