ఆఫ్ఘన్ జాతి నిర్మాణం మా లక్ష్యం కాదు.. అందుకే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా: జో బైడెన్

  • నా ముందున్న రెండు మార్గాల్లో మొదటి దానిని ఎంచుకున్నా
  • నా నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకిస్తారని నాకు తెలుసు
  • ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అన్నీ ఇచ్చినా సంకల్ప బలం ఇవ్వలేకపోయాం
ఆప్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెదవి విప్పారు. ఆ దేశం నుంచి సైన్యాన్ని ఉపసంహరించడంపై విమర్శలు వస్తున్న వేళ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఆఫ్ఘన్ గడ్డపై నుంచి బలగాలను ఉపసంహరించడానికి సరైన సమయం ఏదన్న విషయాన్ని 20 ఏళ్ల తర్వాత గ్రహించినట్టు చెప్పారు. అయితే, తాలిబన్లు మరీ ఇంత వేగంగా చెలరేగిపోతారని, ఆప్ఘన్‌ను ఆక్రమిస్తారని ఊహించలేదన్నారు.

తన ముందు రెండే మార్గాలు ఉన్నాయని, వాటిలో ఒకటి ఆఫ్ఘన్ నుంచి దళాలను ఈ ఏడాది వెనక్కి రప్పించడం కాగా, రెండోది ఆఫ్ఘన్‌కు మరిన్ని సైనిక బలగాలను పంపి మూడో దశాబ్దంలోనూ యుద్ధాన్ని కొనసాగించడమని పేర్కొన్న బైడెన్.. తాను మొదటి మార్గాన్నే ఎంచుకున్నట్టు చెప్పారు. గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నానని వివరించారు. సైన్యం ఉపసంహరణ నిర్ణయానికే తాను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు.

అమెరికాపై ఉగ్రవాదుల దాడులను నిరోధించడమే తమ లక్ష్యమని పేర్కొన్న బైడెన్.. ఈ నిర్ణయం అమెరికాకు సరైనదేనని అన్నారు. తాలిబన్లు అమెరికా ప్రజలపై దాడిచేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని తనకు తెలుసని అన్నారు. అయితే, మరో దేశ అంతర్యుద్ధంలో పోరాడాలని సైనిక బలగాలకు తాను చెప్పలేనన్నారు. సెప్టెంబరు 11 దాడుల తర్వాత అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం తప్పితే, ఆఫ్ఘన్ జాతి నిర్మాణం తమ లక్ష్యం కాదన్నారు.

అమెరికా దళాలకు సాయం చేసిన అక్కడి ఆఫ్ఘన్ ప్రజలను త్వరలోనే అమెరికాకు తరలిస్తామన్న బైడెన్.. వారిపై తాలిబన్లు దాడిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్ సైన్యానికి అన్ని రకాల వనరులు కల్పించి, శిక్షణ ఇచ్చినప్పటికీ తాలిబన్లతో పోరాడలేక చేతులు ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఇచ్చినప్పటికీ సంకల్ప బలం మాత్రం ఇవ్వలేకపోయామని బైడెన్ అన్నారు. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News