ఎగిరే కార్లపై భారతీయ స్టార్టప్ ఫోకస్.. అక్టోబరు నాటికే సిద్ధం!

  • అనుకున్నట్లు జరిగితే ఈ ఘనత సాధించే తొలి ఆసియా కంపెనీ
  • పూర్తి డిజైన్ సిద్ధం చేసిన చెన్నై స్టార్టప్
  • అక్టోబరు 5న లండన్‌లో ప్రదర్శన
‘ఓలా’ ఎలక్ట్రిక్ వాహనాల పుణ్యమాని ప్రస్తుతం దేశం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. పెరుగుతున్న పెట్రోలు, డీజిలు ధరలు కూడా దీనికి ఒక కారణమే. ఇలా అందరూ ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ పెడుతుంటే.. స్టార్టప్ కంపెనీలు మాత్రం ఎగిరే కార్లపై దృష్టిపెడుతున్నాయి. ఒక కంపెనీ ఈ విషయంలో మరింత ముందడుగేసి అక్టోబరులో తమ తొలి మోడల్ ఎగిరే కారును ప్రదర్శించేందుకు రెడీ అవుతోంది.

చెన్నైకు చెందిన వినత ఎయిరో మొబిలిటీ అనే కంపెనీ తాము ఎగిరే కారు పూర్తి డిజైన్‌ను తయారు చేసినట్లు చెబుతోంది. ఈ ఏడాది అక్టోబరు 5 నాటికి తమ ‘ఫ్లైయింగ్ కారు’ మోడల్ పూర్తవుతుందని అంటోంది. ఇప్పటికే ఈ కారు నిర్మాణ పనుల్లో ఈ కంపెనీ బిజీబిజీగా గడుపుతోందని తెలుస్తోంది. 2021 అక్టోబరు 5న లండన్‌లో జరిగే హెలీటెక్ ఎగ్జిబిషన్‌లో తమ కారును ప్రదర్శించాలని ఈ కంపెనీ యాజమాన్యం భావిస్తోంది.

ఈ కంపెనీ తయారు చేస్తున్న ఎగిరే కారులో ఇద్దరు ప్యాసింజర్లు ప్రయాణించే వీలుంటుందట. దీని బరువు 1100 కేజీలుకాగా, ఇది మొత్తంగా 1300 కేజీల బరువును మోయగలదని తయారీదారులు చెబుతున్నారు. వర్టికల్‌గా అంటే నిట్టనిలువుగా టేకాఫ్‌ అవడం, ల్యాండింగ్‌ అవడం ఈ కారు ప్రత్యేకత. ఈ కారులో హైబ్రిడ్‌ ఇంజిన్‌ అమరుస్తున్నట్లు సమాచారం. కారు ఎగిరేందుకు జీవ ఇంధనాన్ని ఉపయోగించుకుంటుందట. అవసరమైతే ఎలక్ట్రిక్‌ ఎనర్జీతో కూడా దీన్ని నడపొచ్చు.

ఈ కారులో కో-యాక్సియల్ క్వాడ్ రోటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వినత ఎయిరో మొబిలిటీ కంపెనీ చెప్తోంది. అలాగే కారు ప్యానెల్‌లో డిజిటల్ పరికరాలు వాడుతున్నారట. ఇది గాల్లో 3,000 అడుగుల ఎత్తుకు చేరుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒకసారి ట్యాంకు నిండుగా ఇంధనం నింపితే 100 కిలోమీటర్లు, లేదంటే ఒక గంటసేపు ప్రయాణించగలదు. అత్యధికంగా 120 కిలోమీటర్ల వేగం అందుకోగలదు.

ఇంతకాలం కేవలం పాశ్చాత్య దేశాలే ఇలా ఎగిరే కార్ల కలలు కన్నాయి. యూరప్, అమెరికా కంపెనీలే ఈ కార్ల తయారీకి ప్రయత్నాల్లో ముందున్నాయి. ఆసియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ కూడా ఈ టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్టోబరు నాటికి ప్రోటోటైప్ తయారు చేసి ప్రదర్శన ఇస్తే.. ఈ ఎగిరే కారును తయారు చేసిన తొలి ఆసియన్ కంపెనీగా వినత ఎయిరో మొబిలిటీ రికార్డు సృష్టిస్తుంది.


More Telugu News