అమెరికా వెళ్లే యోచనలో ఆఫ్ఘనిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఘనీ

  • ఆఫ్ఘనిస్థాన్ నుంచి పరారై ప్రస్తుతానికి ఒమన్‌లో
  • ఆయన వెంటే మాజీ భద్రతా సలహాదారు
  • భాగస్వామ్య ప్రభుత్వం కోసం తాలిబన్లతో మాజీ అధ్యక్షుడి చర్చలు

తాలిబన్లు కాబూల్‌ను చుట్టుముట్టడంతో ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. దేశం వదిలి పరారైన సంగతి తెలిసిందే. ఆయన తజికిస్థాన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఆయన విమానం ల్యాండవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతివ్వలేదట. దీంతో మరో దారిలేక ఘనీ.. ఒమన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒమన్‌లో ఉన్న ఆయన.. రక్తపాతం జరగకుండా నిలువరించేందుకే తాను ఆఫ్ఘన్ నుంచి వచ్చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్ లో పోస్టు చేశారు.

ఒమన్ నుంచి అమెరికా వెళ్లి తలదాచుకోవాలని ఘనీ భావిస్తున్నారట. ఆయన వెంట మాజీ జాతీయ భద్రతా సలహాదారు హందుల్లా మొహిబ్ కూడా ఉన్నారు. ఘనీ పరారవడంతో ఆఫ్ఘన్ దేశం తాలిబన్ వశమైంది. ఈ క్రమంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయీ, నేషనల్ రికన్సిలేషన్ ఉన్నత మండలి అధ్యక్షుడు అబ్దుల్లా అబ్దుల్లా.. తాలిబన్లతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు వర్గాలూ కలిసి భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కోసం వాళ్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలే ప్రస్తుతం తజికిస్థాన్‌లో ఉన్నారు. ఆయన మొదట పాంజిషిర్ వెళ్లి అక్కడి నుంచి తజికిస్థాన్ చేరుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ గడ్డను వీడిన పదిరోజుల్లోనే ఇలా దేశం తాలిబన్ వశమవడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మెరుపువేగంతో తమ ఆక్రమణను కొనసాగించిన తాలిబన్ దళాలు.. కేవలం పదిరోజుల్లోనే కాందహార్, హెరాత్, మజర్-ఎ-షరీఫ్, జలాలాబాద్ వంటి ముఖ్యమైన పట్టణాలను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆదివారం నాడు దేశం మొత్తం వారి హస్తగతమైంది.


More Telugu News