ఈ కిరికిరిగాళ్లు, ఈ కొండెగాళ్లకు ఏంటి కడుపుమంట?: సీఎం కేసీఆర్

  • దళిత బంధు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం
  • హుజూరాబాద్ లో ప్రారంభించిన సీఎం కేసీఆర్
  • జై భీమ్ అంటూ ప్రసంగం షురూ
  • రైతు బంధులా దళిత బంధు విజయవంతం అవుతుందని ధీమా
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ హుజూరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సభకు వచ్చిన దళిత సోదర సోదరీమణులందరికీ "జై భీమ్" అంటూ ప్రసంగం ప్రారంభించారు.

తాము ఇప్పటికే అమలు చేస్తున్న రైతు బంధు విజయవంతంగా నడుస్తోందని, రైతాంగంలో ఎంతో సంతోషం కనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు దళిత బంధు అదే రీతిన విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దళిత బంధు దేశానికే కాదు, ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు.

ఇతర పార్టీలకు రాజకీయాలు అంటే ఓ క్రీడ అని, టీఆర్ఎస్ పార్టీకి మాత్రం సామాజిక అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. సామాజిక లక్ష్యాలను అందుకోవడం టీఆర్ఎస్ పార్టీకి పవిత్ర కర్తవ్యం అని, దళిత బంధును విజయవంతం చేయడంలోనూ అదే రీతిన కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎప్పుడైనా, ఎక్కడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కనీసం ఈ ఆలోచన వాళ్ల మదిలోకైనా వచ్చిందా? అని నిలదీశారు.

పిల్లి తన సంసారాన్ని చక్కదిద్దుకున్నట్టు నేను ఒక్కొక్క అంశాన్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాను అని వివరించారు. వాస్తవానికి దళిత బంధు ఏడాది కిందటే ప్రారంభం కావాల్సి ఉందని, కరోనా వల్ల ఆలస్యం అయిందని వెల్లడించారు. తాను దళిత బంధు ప్రకటించానో లేదో కిరికిరిగాళ్లు, కొండెగాళ్లు ఒకరు కీ అంటే ఒకరు కా అంటే... ఒకడు ఇంత ఇవ్వాలంటే, ఇంకొకడు అంత ఇవ్వాలంటూ అందరూ దుకాణం మొదలుపెట్టారు అని విమర్శించారు. 'ఏనాడూ ఐదు రూపాయలు ఇవ్వాలని మాట్లాడనివాడు కూడా ఇవాళ మాట్లాడుతున్నాడు' అంటూ వ్యాఖ్యానించారు.

"ఇంకొకడు మాట్లాడుతున్నాడు... ఎలా ఇస్తారో చెప్పాలె, ఎవరెవరికి ఇస్తారో చెప్పాలె అంటుండు. ఎందుకు చెప్పం... కుండబద్దలు కొట్టినట్టు చెబుతాం. ఎట్లా చెప్పాలో అట్లా చెబుతాం. నాకొకటి అర్థం కావడం లేదు... ఇచ్చేవాడు ఇస్తాడు, తీసుకునేవాడు తీసుకుంటాడు... మధ్యలో వాళ్లకు ఏంటి కడుపుమంట?" అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News