రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ చెన్నై బెంచ్ లో విచారణ

  • జలవివాదాలపై ఎన్జీటీ విచారణ
  • తెలంగాణ సమర్పించిన ఫొటోల పరిశీలన
  • ఏపీ పనులు కొనసాగించినట్టుందని వ్యాఖ్యలు
  • తాము పనులు నిలిపివేశామన్న ఏపీ
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ విచారణ కొనసాగించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేడు విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫొటోలను ఎన్జీటీ పరిశీలించింది. పనులు భారీగానే జరిగినట్టు ఫొటోల ద్వారా తెలుస్తోందని ఎన్జీటీ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ ప్రభుత్వం ధిక్కరణకు పాల్పడినట్టు అర్థమవుతోందని పేర్కొంది.  

దీనిపై ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ, ఆగస్టు 7వ తేదీ నాటికే పనులను నిలిపివేసినట్టు స్పష్టం చేసింది. ఈ నెల 7 తర్వాత ఎలాంటి పనులు చేపట్టలేదని వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో, పర్యావరణ శాఖతో ఏపీ కుమ్మక్కైనట్టు అనిపిస్తోందని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంతవరకు పర్యావరణ శాఖ నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. అనంతరం, ఈ నెల 27న తదుపరి చర్యలపై తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. విచారణను అప్పటివరకు వాయిదా వేసింది.


More Telugu News