ఉప సర్పంచ్ వేధిస్తున్నారు.. కేసీఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటా:హూజురాబాద్ మండలం చెల్పూర్ సర్పంచ్ మహేందర్

  • అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై సంతకాలు చేయడం లేదు
  • అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశాను
  • నాకు చావడం తప్ప మరో మార్గం లేదు
హుజూరాబాద్ లో ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన భారీ బహిరంగసభ జరగనుంది. ఈ కార్యక్రమంలో దళితబంధు పథకాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. 15 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేయనున్నారు. మరోవైపు, కేసీఆర్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని హూజురాబాద్ మండలం చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచి గుజ్జ జయసుధ సంతకాలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని మహేందర్ గౌడ్ అన్నారు. అప్పులు తీసుకొచ్చి గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేశానని... 10 నెలలు అవుతున్నా జయసుధ చెక్కులపై సంతకాలు పెట్టడం లేదని మీడియాతో మాట్లాడుతూ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పుల భారంతో తాను ఆర్థికంగా చితికి పోయానని, తనకు చావడం తప్ప మరో దారి లేదని చెప్పారు. మీడియా సమావేశంలో పురుగుల మందు డబ్బా చూపిస్తూ, సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.


More Telugu News