కాబూల్​ విమానాశ్రయం రన్​ వేపైకి చొచ్చుకొచ్చిన జనం.. అమెరికా సైన్యం కాల్పులు.. ఐదుగురి మృతి.. ఇవిగో వీడియోలు

  • దేశం విడిచివెళ్తున్న ఆఫ్ఘనీలు
  • కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న వైనం
  • కట్టడి చేసేందుకు గాల్లోకి సైన్యం కాల్పులు
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించేసుకోవడంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఏ విమానం దొరికితే ఆ విమానం ఎక్కేస్తున్నారు. దీంతో కాబూల్ విమానాశ్రయం మొత్తం గుంపులుగా వస్తున్న జనాలతో నిండిపోయింది. ఏ రన్ వే చూసినా ప్రజల హడావుడే కనిపిస్తోంది.

ఇవాళ ఉదయం ప్రజలు కాబూల్ ఎయిర్ పోర్ట్ లోని టార్మాక్  వద్దకు చొచ్చుకొస్తుండడంతో.. ఆ విమానాశ్రయాన్ని తమ అధీనంలో ఉంచుకున్న అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. ప్రజలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్చింది. కొందరు విమానం ఎక్కేందుకు పోటీపడి తోసుకుంటున్నారు. మెట్ల దారిలోని కాకుండా పక్క నుంచి కూడా ఎక్కే ప్రయత్నం చేశారు. ఘటనలో ఐదుగురు చనిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే కాల్పుల్లో చనిపోయారా? లేదా తొక్కిసలాటలో చనిపోయారా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. అధికారులు కూడా దీనిపై ఇంతవరకూ స్పందించలేదు.

ఘటనలకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇప్పటికే చాలా మంది ప్రజలను ఆ ప్రదేశం నుంచి అమెరికా సైన్యం తరలించింది. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన అనుచరులు తజికిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశం విడిచి వెళ్తున్న ఆఫ్ఘన్ ప్రజల కోసం పలు దేశాలు ఆపన్న హస్తాన్ని అందజేస్తున్నాయి. అందులో భారత్ మొదటి వరుసలో ఉంది. చాలా మంది ఆఫ్ఘనీలు భారత్ వైపే చూస్తున్నారు. విద్య, వైద్యం, ఇతర అన్ని విషయాల్లో మన దేశం మంచిదని వారు భావిస్తున్నారు.


More Telugu News