ఝార్ఖండ్ జడ్జి హత్య కేసులో సమాచారం అందిస్తే రూ.5 లక్షల నజరానా

  • ఝార్ఖండ్ లో జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య
  • ఆటోతో ఢీకొట్టిన దుండగులు
  • ఈ కేసును సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం
  • రివార్డు ప్రకటన జారీ చేసిన సీబీఐ
ఇటీవల ఝార్ఖండ్ లో ధన్ బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను ఉద్దేశపూర్వకంగా ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యాయవర్గాలను ఈ ఘటన తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఈ కేసులో ఝార్ఖండ్ సర్కారు తొలుత సిట్ ఏర్పాటు చేసినా, ఆపై ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కాగా, ఈ కేసులో కీలక సమాచారం అదించిన వారికి సీబీఐ నజరానా ప్రకటించింది.

జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకు సంబంధించిన సమాచారాన్ని తమ కార్యాలయానికి వచ్చి తెలియజేయాలని, దర్యాప్తుకు ఉపయోగపడే సమాచారం అందిస్తే రూ.5 లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. సమాచారం అందించిన వారి వివరాలు ఎంతో రహస్యంగా ఉంచుతామని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసినా, దర్యాప్తు ఏమాత్రం ముందుకు కదల్లేదు. దాంతో నజరానాపై కరపత్రాలు, వాల్ పోస్టర్లు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.


More Telugu News