సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి: మోదీ

  • దేశంలో ఏ ఒక్కరు పోషకాహార లోపంతో బాధపడకూడదు
  • ప్రతి ఇంటికి విద్యుత్, తాగునీరు సుదూర స్వప్నం కాకూడదు
  • శతాబ్ది ఉత్సవాల నాటికి దేశాన్ని ప్రబల శక్తిగా మార్చాలి
  • జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు కొవిడ్ నుంచి దేశాన్ని రక్షించాయి
దేశ సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగరవేసిన మోదీ అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఏ ఒక్కరు పోషకాహార లోపంతో బాధపడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ దుకాణాల్లో పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పోషకాహార లోపంతో పాటు వైద్యం కూడా అత్యంత కీలకమైనదని అన్నారు. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్టు చెప్పారు. ప్రతి  ఇంటికి విద్యుత్, తాగునీరు సుదూర స్వప్నంగా మిగిలిపోకూడదని అన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలన్నారు. పేదరికానికి కులం, మతం తేడా ఉండకూడదని పేర్కొన్నారు.

ప్రతి పేదవాడు సగర్వంగా నిలబడేలా సహాయ, సహకారాలు అందించాలని మోదీ అన్నారు. శతాబ్ది ఉత్సవాల నాటికి దేశాన్ని ప్రబలశక్తిగా మార్చాలన్న సంకల్పం తీసుకోవాలని మోదీ కోరారు. శతాబ్ది ఉత్సవాలకు మిగిలి ఉన్న ఈ 25 ఏళ్లు అమృత ఘడియలని మోదీ పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రతి పౌరుడు క్షణం కూడా వృథా చేయకుండా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొవిన్ యాప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని పేర్కొన్న మోదీ.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 54 కోట్ల మందికి టీకాలు అందించినట్టు తెలిపారు. భారతీయుల జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు కరోనా నుంచి చాలా వరకు రక్షించాయని మోదీ వివరించారు.


More Telugu News