హైతీలో విరుచుకుపడిన భారీ భూకంపం.. 300 మందికిపైగా మృతి

  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • రిక్టర్ స్కేలుపై 7.2గా తీవ్రత
  • దేశంలో నెల రోజులపాటు అత్యవసర పరిస్థితి
  • సాయానికి ముందుకొచ్చిన అమెరికా
కరీబియన్ కంట్రీ హైతీలో నిన్న తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌కు 125 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ హైతీలోని సెయింట్ లూయిస్ డు సుడ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. భూకంప తీవ్రతకు భారీ ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటి వరకు 304 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ తర్వాత ఉపసంహరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

భూకంపం దాటికి దేశంలోని పలు చోట్ల వేలాది ఇల్లు కుప్పకూలాయి. ప్రజలు భయంతో రోడ్లపైకి వచ్చి పరుగులు తీశారు. రంగంలోకి దిగిన విపత్తు, సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఏరియల్ సర్వే నిర్వహించిన హైతీ నూతన ప్రధాని హెన్రీ.. నెల రోజులపాటు దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించారు. హైతీకి సాయం అందించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ అధికారులను ఆదేశించారు. కాగా, 2010లో ఇక్కడ సంభవించిన భారీ భూకంపంలో 2 లక్షల మందికిపైగా మృతి చెందారు.


More Telugu News