క్రీడాకారులైన తల్లిదండ్రులు ఉండడం నా అదృష్టం: పీవీ సింధు

  • టోక్యో ఒలింపిక్స్ కాంస్యం గెలిచిన సింధు
  • ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
  • తండ్రే తనకు స్ఫూర్తి అని వెల్లడి
  • ఓటమి బాధ వారికి తెలుసని వివరణ
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన తెలుగుతేజం పీవీ సింధు వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్ర పుటల్లోకెక్కింది. ఇటీవల టోక్యో నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన సింధు వరుస కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. క్రీడారంగంలో తనకు గొప్పగా స్ఫూర్తినిచ్చిన వ్యక్తి తన తండ్రేనని తెలిపింది.

పీవీ సింధు తండ్రి వెంకటరమణ భారత మాజీ వాలీబాల్ క్రీడాకారుడు. ఆయన హయాంలో భారత జట్టు 1986 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచింది. వెంకటరమణకు 2000 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు లభించింది. పీవీ సింధు తల్లి విజయలక్ష్మి కూడా భారత మాజీ వాలీబాల్ క్రీడాకారిణి.

ఈ నేపథ్యంలో, సింధు స్పందిస్తూ, క్రీడాకారులైన తల్లిదండ్రులు ఉండడం తన అదృష్టమని పేర్కొంది. క్రీడల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వారు అర్థం చేసుకోగలరని వెల్లడించింది. అనేక సంవత్సరాల వారి క్రీడా అనుభవంలో ఓటమి బాధ గురించి వారికి బాగా తెలుసని పేర్కొంది.

"మా నాన్న హైదరాబాద్ రైల్వే గ్రౌండ్స్ లో వాలీబాల్ ప్రాక్టీసు చేస్తుండేవారు. నేను కూడా అక్కడే బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించాను. మొదట్లో సరదాగా ఆడేదాన్ని. క్రమంగా అదే నా జీవితమైపోయింది. నేను బ్యాడ్మింటన్ క్రీడను ఎంచుకుంటానని వారు అనుకోలేదు" అని వివరించింది.

ఇక, టోక్యో ఒలింపిక్స్ లో తాను కాంస్యం గెలవడంలో తన కోచ్ పార్క్ టే శాంగ్ పాత్ర ఎంతో ఉందని సింధు వినమ్రంగా తెలిపింది. ఆయన ఇంకా భారత్ లోనే ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తహతహలాడుతున్నారని వెల్లడించింది. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఒలింపిక్ పతక విజేతలతో భేటీ అవుతున్నారని, ఈ సమావేశం కోసం తన కోచ్ పార్క్ టే శాంగ్ భారత్ లోనే ఉండిపోయారని వివరించింది. "నాతో ఓ పతకం గెలిపించాలనేది పార్క్ టే శాంగ్ కల. గతంలో ఒలింపిక్ మెడల్ గెలవాలని ఆయన ఎంతో తపించారు" అని సింధు పేర్కొంది.


More Telugu News