చలాన్ల కుంభకోణంలో శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోంది: ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ

  • ఏపీలో కలకలం రేపిన నకిలీ చలాన్ల కుంభకోణం
  • 9 జిల్లాల్లో అక్రమాలు
  • కృష్ణా, కడప జిల్లాల్లో అత్యధిక మోసాలు
  • రూ.5 కోట్ల మేర నష్టం
  • రూ.1.37 కోట్లు రికవరీ చేశామన్న రెవెన్యూ శాఖ
రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలాన్ల కుంభకోణంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ స్పందించారు. చలాన్ల అంశంలో శాఖాపరమైన విచారణ జరుగుతోందని వెల్లడించారు.  మొత్తం 65 లక్షల డాక్యుమెంట్లు పరిశీలించామని, రూ.5 కోట్ల నష్టం జరిగినట్టు వెల్లడైందని తెలిపారు.

770 డాక్యుమెంట్లలో భారీ మోసాలు జరిగాయని, రూ.1.37 కోట్లు రికవరీ చేశామని పేర్కొన్నారు. చలాన్లు కట్టారో లేదో విచారణలో తేలుతుందని, కొనుగోలుదారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే 10 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని రజత్ భార్గవ్ వివరించారు. స్కాం జరిగిన 9 జిల్లాల్లో కృష్ణా, కడప జిల్లాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధిక మోసాలు జరిగినట్టు తేలిందని పేర్కొన్నారు.

మొత్తం 10 మందిపై ఆరోపణలు ఉన్నాయని, ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని వెల్లడించారు. దీనిపై సీఐడీ విచారణ అవసరంలేదని, పోలీసు కేసు సరిపోతుందని రజత్ భార్గవ్ అభిప్రాయపడ్డారు.


More Telugu News