కాబూల్​ చుట్టూ తాలిబన్ల చక్రబంధం.. అతి సమీపంలో మాటు వేసిన ఉగ్రవాదులు!

  • 50 కిలోమీటర్ల దూరంలోనే ఉగ్రమూకలు
  • విదేశీ రాయబారుల తరలింపులు వేగవంతం
  • రేపు కాబూల్ చేరనున్న అమెరికా సైన్యం
  • బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న జనం
  • మహిళల మీద ఆగడాలపై ఐరాస ఆందోళన
  • గుండె తరుక్కుపోతోందని ఆవేదన
దాదాపు ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని చెరబట్టేసిన తాలిబన్లు.. ఇక ప్రభుత్వానికి పట్టున్న ఒకే ఒక్క నగరం, దేశ రాజధాని కాబూల్ పై కన్నేశారు. ఆ నగరం అతి సమీపానికి చేరుకున్నారు. కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మాటు వేసి ఉన్నారు. కాబూల్ లోని విదేశీయులను, విదేశీ రాయబారులను తీసుకెళ్లలేకుండా చక్రబంధం సృష్టించేశారు. ఇటు ప్రజలూ ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి దేశ రెండో అతిపెద్ద నగరం, మూడో అతిపెద్ద నగరాలు వెళ్లిపోయాయి.

తాలిబన్లు అత్యంత సమీపంలోనే ఉండడంతో తమ వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ప్రమాదముందని అమెరికా, వివిధ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీలైనంత త్వరగా వారిని విమానాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కాబూల్ చుట్టూ తాలిబన్లు చక్రబంధం పెట్టేయడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక, అత్యంత సున్నిత సమాచారమున్న పత్రాలను కాల్చేయాల్సిందిగా ఎంబసీ అధికారులను అమెరికా ఆదేశించింది.

అంతేగాకుండా అధికారులు, అమెరికన్లను తీసుకెళ్లేందుకు 3 వేల మందితో బలగాలను మోహరించనున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఎయిర్ పోర్ట్ ను తమ అధీనంలోనే ఉంచుకుని విదేశీయుల తరలింపును పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్రిటన్, జర్మనీ, డెన్మార్క్, స్పెయిన్ వంటి దేశాలు వెనక్కు వచ్చేయాల్సిందిగా తమ తమ దేశాల రాయబారులు, దౌత్యాధికారులు, దౌత్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాయి.

ఇన్నాళ్లూ తమకు అండగా ఉన్నవారు వెళ్లిపోతే.. ఇక తమ పరిస్థితేంటని కాబూల్ ప్రజలు, అక్కడ ఆశ్రయం పొందుతున్న శరణార్థులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతోందో కూడా తమకు అర్థం కావట్లేదని, భయం భయంగా ఉందని ఖైరుద్దీన్ లొగారీ అనే స్థానికుడు ఆవేదనా భరిత హృదయంతో చెప్పుకొచ్చాడు. అయితే, ప్రస్తుతానికైతే కాబూల్ కు తాలిబన్లతో వచ్చిన ముప్పు పెద్దగా లేదని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కర్బీ చెప్పారు. అయితే, కాబూల్ లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయన్నారు. రాయబారుల తరలింపు కోసం ఆదివారం నాటికి అమెరికా సైన్యం కాబూల్ లో ఉంటుందన్నారు. రోజూ వెయ్యి మంది చొప్పున తరలిస్తామన్నారు.

ప్రస్తుత పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై తాలిబన్ల ఆగడాలు శ్రుతి మించిపోయాయని, వాటిని తలచుకుంటుంటే గుండె తరుక్కుపోతోందని అన్నారు. ఎంతో పోరాడి తిరిగి సంపాదించుకున్న మహిళల హక్కులను తాలిబన్లు మళ్లీ కాలరాసేస్తున్నారంటే ఎంతో ఆవేదనగా ఉందన్నారు. తాలిబన్లు దానికి దూరంగా ఉండాలని, హింసను ఆపేయాలని ఆయన సూచించారు.


More Telugu News