సుశాంత్ సినిమాకి రిలీజ్ డేట్ ఖరారు!

  • సుశాంత్ నుంచి 'ఇచట వాహనములు నిలుపరాదు'
  • కథానాయికగా మీనాక్షి చౌదరి పరిచయం
  • కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా  
  • ఈ నెల 27వ తేదీన విడుదల

తెలుగు తెరకి సుశాంత్ హీరోగా పరిచయమై చాలాకాలమే అయింది. అప్పటి నుంచి కూడా ఆయన బ్రేక్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. తనకి నచ్చిన కథలతో ప్రేక్షకుల ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఇచట వాహనములు నిలుపరాదు' అనే సినిమా నిర్మితమైంది.

ఏఐ స్టూడియోస్ .. శాస్త్రా మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, దర్శన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమై చాలా రోజులే అయింది. అయితే కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన వెయిట్ చేస్తూ వచ్చింది. కరోనా ప్రభావం తగ్గడం .. థియేటర్ల దగ్గర జనం పెరగడంతో ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది.

ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేయలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ సినిమాతో కథానాయికగా మీనాక్షి చౌదరి తెలుగు తెరకి పరిచయం కానుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందించిన ఈ సినిమా, సుశాంత్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.  



More Telugu News