గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి వెళితే సాక్షులకు ముప్పు..  షరతులు సడలించొద్దు: సుప్రీంకోర్టును కోరిన సీబీఐ

  • అనంతపురం, కడప, బళ్లారి వెళ్లకుండా ఆంక్షలు
  • బళ్లారిలో 8 వారాలపాటు ఉండేందుకు అనుమతి కోరుతూ పిటిషన్
  • 300 మంది సాక్షుల్లో 47 మంది బళ్లారిలోనే ఉన్నారన్న సీబీఐ  
  • విచారణ నేటికి వాయిదా
అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి బళ్లారిలో 8 వారాలపాటు నివసించేందుకు అనుమతి కోరుతూ పెట్టుకున్న పిటిషన్‌పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. తన క్లయింట్ ఎప్పుడూ బెయిలు షరతులను ఉల్లంఘించలేదని, గతంలో చాలా సందర్భాల్లో బళ్లారి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. మరో న్యాయవాది రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం సుప్రీంకోర్టులో పెండింగులో ఉందని, విచారణ ప్రారంభం కాకపోవడానికి ఈ కేసును కారణంగా చెబుతున్నారని అన్నారు.
 
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవి దివాన్‌ వాదనలు వినిపిస్తూ.. నిందితుడు జనార్దన్‌రెడ్డి బళ్లారి వెళితే సాక్షులకు ముప్పు తప్పదని, జనం కూడా భయపడతారని అన్నారు. కాబట్టి బెయిలు షరతులు సడలించవద్దన్నారు. ఆయనకు బెయిలు మంజూరు చేసిన సమయంలో అనంతపురం, కడపతోపాటు కర్ణాటకలోని బళ్లారి జిల్లాలకు వెళ్లకుండా కోర్టు షరతు విధించింది. ఇప్పుడీ ఆంక్షలను సడలించాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించగా, నిన్న న్యాయమూర్తులు జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ కేసులోని దాదాపు 300 మంది సాక్షుల్లో 47 మంది బళ్లారిలోనే ఉన్నారని, ఇప్పుడు బెయిలు షరతులు సడలిస్తే విచారణ మరింత ఆలస్యమవుతుందని మాధవి దివాన్ పేర్కొన్నారు. విచారణను ఆలస్యం చేసేందుకు నిందితులు ఒకరి తర్వాత ఒకరిగా క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు, స్టే ఉత్తర్వులపై అప్పీళ్లు వంటివి వేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, వాదనలు వినిపించేందుకు తనకు మరో అరగంట పాటు సమయం కావాలని మాధవి కోరగా, విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది.


More Telugu News