ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్-10ను నేను ఉల్లంఘించలేదు: రఘురామ

  • కొనసాగుతున్న వైసీపీ, రఘురామ పోరు
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రఘురామ
  • తమ ఎంపీలు న్యాయశాఖమంత్రిని కలిసినట్టు వ్యాఖ్య 
  • ఫిరాయింపు చట్టంలో సవరణలు కోరారని వివరణ
నరసాపురం ఎంపీ, వైసీపీ రెబెల్ నేత రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు అంశంపై తమ ఎంపీలు న్యాయశాఖ మంత్రిని కలిశారని, ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని వారు మంత్రిని కోరారని తెలిపారు. కానీ, ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్-10ను తాను ఉల్లంఘించలేదని రఘురామ స్పష్టం చేశారు. అటు, తమ ఎంపీలు హైకోర్టును కర్నూలుకు మార్చాలని కూడా మంత్రికి విన్నవించారని వివరించారు. అయితే, పార్టీ హెడ్ క్వార్టర్స్ మార్చినంత త్వరగా కోర్టును మార్చుతారా? అని రఘురామ ప్రశ్నించారు.

వైసీపీ సర్కారు తిరుమల శ్రీవారిని కూడా వదలడంలేదని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇకపై సాలీనా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ లో నిర్ణయించారని వెల్లడించారు. పరిస్థితి చూస్తుంటే స్వామివారి నగలను సైతం విక్రయిస్తారేమోనన్న సందేహాలు వస్తున్నాయని తెలిపారు.

"ఈ ప్రభుత్వం ఇకనైనా మా దేవుడ్ని వదిలేయాలి. తిరుమల వెంకన్న ఆస్తుల జోలికి వెళ్లవద్దంటూ భక్తులందరం కలిసి సీఎంకు వినతి పత్రం పంపుదాం" అని రఘురామ పేర్కొన్నారు.


More Telugu News