జానారెడ్డికి పట్టిన గతే ఈటలకు కూడా పడుతుంది: తలసాని శ్రీనివాస్ యాదవ్

  • గెల్లు శ్రీనివాస్ ను కేసీఆర్ బానిస అనడం ఈటల అహంకారానికి నిదర్శనం
  • ఈటల హుజూరాబాద్ లో బీసీ, శామీర్ పేటలో ఓసీ
  • కేసీఆర్ దయతో ఈటల ఆరు సార్లు గెలిచారు
హుజూరాబాద్ ఉపఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ బరిలోకి దించింది. శ్రీనివాస్ ను తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ ప్రకటించిన వెంటనే బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కేసీఆర్ బానిస గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

గెల్లును కేసీఆర్ బానిస అని అనడం సరికాదని తలసాని అన్నారు. ఈటల అహంకారానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని మండిపడ్డారు. ఈటల ముందు గెల్లు శ్రీనివాస్ చిన్నవాడే కావచ్చని... ఆనాడు దామోదర్ రెడ్డి ముందు ఈటల కూడా చిన్నవాడేనని తలసాని అన్నారు. ఈటల హుజూరాబాద్ లో బీసీ, శామీర్ పేటలో ఓసీ అని ఎద్దేవా చేశారు.

ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యతను ఇస్తుందని... గతంలో బాల్క సుమన్, కిశోర్ లకు అవకాశం కల్పించినట్టుగానే ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ కు కేసీఆర్ అవకాశం ఇచ్చారని తలసాని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి పట్టిన గతే ఇప్పుడు హుజూరాబాద్ లో ఈటలకు పడుతుందని అన్నారు. కేసీఆర్ దయతోనే ఈటల ఆరు సార్లు గెలిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇష్టానుసారం మాట్లాడటాన్ని బీజేపీ నేతలు మానుకోవాలని సూచించారు.


More Telugu News