ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారే వినియోగదారులకు వాట్సాప్ గుడ్ న్యూస్!

  • చాట్ హిస్టరీని కోల్పోతామన్న భయానికి ఇక సెలవు
  • తొలుత శాంసంగ్ గెలాక్సీ ఫోన్లకు అందుబాటులోకి
  • ఆ తర్వాత అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు
ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారే వినియోగదారులకు వాట్సాప్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారే సమయంలో వాట్సాప్ హిస్టరీని అంటే వాయిస్ నోట్‌లు, ఫొటోలు వంటి వాటిని కోల్పోవాల్సి ఉంటుంది. అయితే, ఇక నుంచి ఇలాంటి భయం అక్కర్లేదు. ఎందుకంటే ఇలా మారిన సందర్భాల్లో వాటిని కొత్త ఫోన్‌లోకి బదిలీ చేసే సామర్థ్యాన్ని వాట్సాప్ తీసుకొస్తోంది.

అయితే, ఈ ఫీచర్ కచ్చితంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంలో మాత్రం కొంత అస్పష్టత ఉంది. తొలుత ఐవోఎస్ నుంచి శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 3, జడ్ ఫ్లిప్ 3 ఫోన్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుండగా ఆ తర్వాత ఇతర శాంసంగ్ ఫోన్లకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఐవోఎస్ నుంచి అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.  

చాట్ హిస్టరీని ఇంటర్‌నెట్ ద్వారా పంపించుకోవడం కాకుండా యూఎస్‌బీ-సి కేబుల్‌ను ఉపయోగించి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఈ నయా ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే, ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే.. గతంలో ఐవోఎస్, ఆండ్రాయిడ్ మధ్య బదిలీ చేసి, రెండు వేర్వేరు క్లౌడ్ బ్యాకప్‌లు కలిగి ఉంటే మాత్రం కొత్త ఫీచర్ వాటిని సింగిల్ చాట్ హిస్టరీలో విలీనం చేయలేదు. అయితే, దీనికి బదులుగా వాట్సాప్ మీ చాట్ హిస్టరీని మైగ్రేట్ చేయడానికి, దానిని బ్యాకప్ చేయడానికి ఉపయోగిస్తే అది ఇప్పటికే ఉన్న ఏదైనా బ్యాకప్‌లను భర్తీ చేస్తుంది.


More Telugu News