ఖబడ్దార్ కేసీఆర్.. నీ ఆటలు ఇక సాగవు: షర్మిల

  • ఉద్యోగాలు ఇవ్వడానికి కేసీఆర్ కు మనసు రావడం లేదు
  • రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు
  • ఉపఎన్నికల్లో గెలిచేందుకు వేల కోట్లు ఖర్చు పెడతారు
ఇకపై నీ ఆటలు సాగవంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రాజన్న బిడ్డ వచ్చింది... మేమంతా వచ్చాం.. వైయస్సార్ తెలంగాణ పార్టీ వచ్చింది... మేం ప్రశ్నిస్తాం... ఇక నీ ఆటలు సాగవని' అన్నారు. ప్రజల పక్షాన తాము పోరాడతామని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. రాబోయేది రాజన్న రాజ్యమని... తెలంగాణ ప్రజలందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

రాష్ట్రంలో 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసి కేసీఆర్ వారి కడుపు కొట్టారని షర్మిల మండిపడ్డారు. 50 మంది ప్రాణాలు కోల్పోవడానికి కేసీఆర్ కారణమయ్యారని చెప్పారు. నిజానికి పోవాల్సింది ముఖ్యమంత్రి ఉద్యోగమని అన్నారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టి... నీళ్లన్నీ కేసీఆర్ ఇంటికి, నిధులన్నీ కేసీఆర్ ఫాంహౌస్ కి, నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికి దక్కించుకున్నారని విమర్శించారు.

రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నా ఉద్యోగాలు ఇవ్వడానికి కేసీఆర్ కు మనసు రావడం లేదని షర్మిల అన్నారు. 'అయ్యా కేసీఆర్ గారూ... మీరు అనవసరంగా వృథా చేస్తున్న సొమ్ముతో షబ్బీర్ లాంటి ఆత్మహత్యలు చేసుకున్న ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు' అని చెప్పారు. ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి చేతకాదని మండిపడ్డారు. ఉపఎన్నికలు వస్తే మాత్రం గెలిచేందుకు అడ్డగోలుగా వేల కోట్లు ఖర్చు పెడతారని దుయ్యబట్టారు. మీకు అండగా మేమున్నామని నిరుద్యోగులకు షర్మిల భరోసా ఇచ్చారు. హుజూరాబాద్ లో నిరుద్యోగులు వందల సంఖ్యలో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ప్రాణాలతో ఆడుకుంటున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని అన్నారు.


More Telugu News